Biography

గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి శాసనసభ్యులు

తల్లిదండ్రులు: గండ్ర సమ్మారావు, సుశీల
భార్య: పద్మ, ప్రస్తుతం ఘణపురం జడ్పీటీసీ సభ్యురాలు
పిల్లలు: అశ్విని, అనూష
గ్రామం: బుద్ధారం
మండలం: ఘణపురం
జిల్లా: జయశంకర్ భూపాలపల్లి
నియోజకవర్గం: భూపాలపల్లి (108)
పుట్టిన తేది: 1965 జూన్ 10
విద్యాభ్యాసం: ప్రాథమిక విద్యాభాస్యం స్వగ్రామంలోనే కొనసాగింది. గణపురం మండల కేంద్రంలో పదో తరగతి వరకు చదివారు. అనంతరం ఐటీఐ (సివిల్) హన్మకొండలో పూర్తి చేశారు.

రాజకీయ అరంగేట్రం..

ఆది నుంచి విప్లవ భావజాలం కలిగిన సత్యనారాయణరావు చదువుకునే క్రమంలో ఆర్ఎస్ యూ (రాడికల్ విద్యార్థి సంఘం)లో చేరి విద్యార్థి సమస్యలపై గళమెత్తి నాయకత్వం లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో 1984లో ఆ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. 23 ఏళ్ల వయసులోనే 1987–,-88లో తెలుగుదేశం పార్టీ నుంచి బుద్ధారం గ్రామ సర్పంచిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 1995 వరకు సర్పంచిగా బుద్ధారం గ్రామంలో అభివృద్ది పనులు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వగ్రామం బుద్ధారంలో ఆయన శ్రీపర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కట్టించారు. 1995లో తెలుగుదేశం నుంచి గణపురం మండలం జడ్పీటీసీగా విజయం సాధించారు. 1999 వరకు గణపురం మండల జడ్పీటీసీ గా కొనసాగారు. 2009లో జరిగిన నియోజవకర్గాల పునర్విభజనలో భూపాలపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఆవిర్భవించింది.   2009 ఎన్నికల్లో తెలుగు దేశం, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా భూపాలపల్లి స్థానాన్ని టీడీపీ, బీఆర్ఎస్ కు కేటాయించడంతో సత్యనారాయణరావుకు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లభించలేదు.   2009 లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రాకపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉన్నారు. మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు ఆయన బీజేపీ నుంచి ఇక్కడ కమలం అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పడు 57,530 ఓట్లు సాధించి జీఎస్సార్ రెండో స్థానంలో నిలిచారు. మళ్లీ 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ, అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి టిక్కెట్ కేటాయించింది. దీంతో సత్యనారాయణ రావు ఏఐఎఫ్ బీ (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ) నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర రమణారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారికి ముచ్చెమటలు పట్టించి 54,283 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఓటమి నుంచి గెలుపు పాఠం నేర్చుకున్న ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 53వేలకు పైగా మెజార్టీ ఓట్లు సాధించి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని ఓడించారు